The Kitáb-i-Aqdas - Questions And Answers

1. ప్రశ్న: మహోన్నత పర్వదినమునకు సంబంధించి.

జవాబు : బయాన్ ప్రకారము మహోన్నత పర్వదినము* సంవత్సరమందలి రెండవ మాసపు పదమూడవ రోజునాటి మధ్యాహ్నానంతర మారంభమగును. ఈ పర్వకాలమునకు సంబంధించిన మొదటి, తొమ్మిదవ, పండ్రెండవ రోజులయందున పనిచేయుట నిషేధింపబడినది.

2. ప్రశ్న: జన్మదినద్వయమునకు సంబంధించి.

జవాబు: మొహరం (ఇస్లామిక్ చాంద్రమాన పంచాంగమందలి మొదటి నెల) మాసపు రెండవ రోజునాటి ఉషఃకాలము ఆభా సౌందర్యుని (బహాఉల్లా) జన్మఘడియ; కాగా, ఈ మాసపు మొదటి రోజు ఆయన దివ్యవార్తాహరుని ఆవిర్భావమునకు సూచకము.  భగవంతుని దృష్టియందీ రెండు రోజులును ఒక్కటిగనే గణియింప బడినవి.

3. ప్రశ్న: వివాహసంబంధమైన పవిత్రవచనాలకు సంబంధించి . (అరబ్బీ భాషలో ఈ రెండు పవిత్రవచనాలు స్త్రీ, పురుషులకు వేరువేరుగా ఉంటాయి)

జవాబు: మగవారికి : “నిశ్చయముగ మేమెల్లరమును దైవేచ్ఛకు బద్ధులమై యుందుము.” మగువలకు: “నిశ్చయముగ, మేమెల్లరమును దైవేచ్ఛకు బద్ధులమై యుందుము.”

4. ప్రశ్న: తన అనుపస్ధితి కాలాన్ని - అంటే తాను తిరిగివచ్చేసమయాన్ని సూచనామాత్రంగానైనా తెలియచేయకుండా, ఏ వ్యక్తి ఐనా పయనమై పోయి, ఆ పై ఆతని గురించి ఏ మాటా వినరాక, ఏ జాడా తెలియరాక పోతే, ఆతని భార్య అనుసరించదగిన విధానం ఏమిటి?

జవాబు: ఏ వ్యక్తి యైనను కితాబ్-ఎ-అఖ్దస్ నందు స్పష్టముగ నిర్దేశితమైన ఒప్పందము గురించి తెలిసి యుండియు, తాను తిరిగి వచ్చు సమయమును నిర్ధారణగ చెప్పుటను విస్మరించిన, అటువంటి వ్యక్తి భార్య పూర్తిగా నొక సంవత్సర కాలముపాటు నిరీక్షించిన మీదట, శ్లాఘనీయమైన విధానము నవలం బించుటకైనను, పునర్వివాహము చేసికొనుటకైనను స్వతంత్రురాలు. ఒకవేళ ఆతనికీ యొప్పందము గురించి తెలిసి యుండని పక్షమున, ఆమె యోర్మిని వహియించి, ఆతని గతి ఏమైనదో తనకు వెల్లడించుటకు భగవంతుడు ప్రీతిని వహియించునంత వరకును నిరీక్షింపవలె. ఇందుకు సంబంధించి, శ్లాఘనీయమైన విధానమనగా - ఓరిమిని వహియించుటయే.

5. ప్రశ్న: “ఇంకను జనియింపనట్టి శిశువుల యార్తనాదముల నాలకించి, వారి వాటాను మేము ద్విగుణీకృత మొనరించి, మిగిలినవారి వాటాలను తగ్గించి నార,” మను పవిత్ర ప్రవచనానికి సంబంధించి :

జవాబు: భగవంతుని దివ్యగ్రంథానుసారము, దివంగతుని ఆస్తిపాస్తులు 2,520 వాటాలుగా విభజించ బడును. ఈ సంఖ్య 1 నుండి 9 వరకు గల పూర్ణసంఖ్యల సామాన్య గుణిజము. ఈ వాటాలన్నియును ఆపై ఏడు భాగములు చేయబడి, వాటిలో ఒక్కొక్కటియును, దివ్యగ్రంథమున పేర్కొనబడినట్లు, ప్రత్యేకింపబడిన వారస వర్గమునకు కేటాయింపబడును. ఉదా: పిల్లలకు, 60 వాటాలు గల 9 భాగములు, అనగా మొత్తం 540 వాటాలు కేటాయింపబడినవి. “వారి వాటాను మేము ద్విగుణీకృత మొనరించితి” మను వాక్కుల కర్ధము: పిల్లలను, 60 వాటాలు గల మరో 9 భాగములకు, అనగా మొత్తం 18 భాగములకు అర్హులను గావించితిమని. అదనముగ వారు పొందు ఈ వాటాలు ఇతర వారస వర్గముల వాటాల నుండి తగ్గింపబడినవి. అందువలన, ఉదాహరణకు : “నాలుగు వందల ఎనుబది వాటాలు గల ఎనిమిది భాగము” లకు అనగా, 60 వాటాలు గల 8 భాగములకు సమానమగు వంతునకు భార్య లేక భర్త అర్హులని వెల్లడించబడినను, ఈ పునర్వ్యవస్ధీకరణ వలన 90 వాటాలతో కూడిన ఒకటిన్నర భాగమును, భార్య లేక భర్తకు చెందిన భాగమున తగ్గించి, తిరిగి పిల్లలకు కేటాయించడమైనది; అటులే, తక్కిన వారసుల విషయమునను జరిగినది. ఫలితముగా: తగ్గింపబడిన మొత్తము, పిల్లలకై అదనముగా కేటాయింపబడిన 9 భాగములకు సమమగును.

6. ప్రశ్న: దివంగతుని సోదరుడు వారసత్వాస్తిలో తన వాటాకు అర్హుడు కావాలంటే, అతను, తన దివంగత సోదరుని తల్లిదండ్రులు ఇద్దరికీ జన్మించి ఉండటం అవసరమా ? లేక తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి జన్మించి ఉన్నా సరిపోతుందా?

జవాబు: సోదరుడు కనుక తండ్రికి జన్మియించి యుండిన, దివ్యగ్రంథమున నిర్ణయించిన వారసత్వపు వాటాకు అర్హుడగును;  ఒకవేళ, ఆతడు తల్లికి జన్మించి యుండిన, నిర్ణయింపబడిన వాటాయం దాతనికి మూడింట రెండువంతులు మాత్రమే లభించును; మిగిలిన మూడవ వంతు న్యాయమందిరమునకు మరలింపబడును. సోదరి విషయమునను ఇదే నియమ మనువర్తించును.

7. ప్రశ్న: వారసత్వాస్తికి సంబంధించిన నియమాలలో , మృతుడు నిస్సంతు అయితే, అతని ఆస్తిలో సంతానానికి చెందవలసిన వాటా న్యాయ మందిరానికి మళ్లించబడాలని ఉంది. మరి, ఇతర వారసత్వవర్గీయులు అంటే తండ్రి , తల్లి, సోదరుడు, సోదరి, ఉపాధ్యాయుడు సైతం లేని పక్షంలో, వారి వారసత్వవాటాలు కూడా న్యాయమందిరానికి మళ్లించబడతాయా, లేక వేరే విధంగా పంపిణీ చేయబడతాయా?

జవాబు : పవిత్ర ప్రవచనమే చాలును. ఆయన - ఆయన వాక్కులు ప్రకీర్తితములగు గాక : “మృతి నొందిన వారికి సంతానము లేనిచో, వారి వాటా . . . న్యాయమందిరమునకు చెందవలె” నని, “మరణించిన వారికి పిల్లలుండి, దివ్యగ్రంథమునందు పేర్కొనబడిన ఇతర ఔరసవర్గీయులెవ్వరును లేని యెడల, వారికి మూడింట రెండు వంతుల యాస్తి సంక్రమింపవలె; మిగిలిన మూడవ వంతు న్యాయ మందిరమునకు మరలింపబడవలె” నని ప్రవచింపుచున్నాడు. వేరొకతీరున చెప్పవలెననిన, సంతానము లేని సందర్భములలో, వారసత్వపుటాస్తిలో వారికై ఏర్పరచిన భాగము న్యాయమందిరమునకు మరలింప బడును; సంతానముండి, యితర వారస వర్గీయులు లేనపుడు, వారసత్వపుటాస్తియందు మూడింట రెండు వంతులు సంతానమునకు చెందును, మూడవ వంతు న్యాయమందిరమునకు మరలింపబడును. ఈ నియమమునకు సాధారణ, ప్రత్యేక అనువర్తనములు రెండును కలవు. అనగా, తరువాయి వర్గమునకు చెందిన వారసులెవ్వరును లేనిచో, రెండు వంతులు సంతానమునకును, మిగిలిన మూడవ వంతు న్యాయ మందిరమునకును చెందును.

8. ప్రశ్న: హుఖుఖుల్లా చెల్లింపు అనువర్తించే కనీస మొత్తానికి సంబంధించి. 
 
 జవాబు: హుఖుఖుల్లా చెల్లింపు అనువర్తించు కనీస మొత్తం విలువ పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణము. అనగా, ఈ మొత్తమునకు సమానమగు ధనమార్జింపబడినప్పుడు దానిపై హుఖుఖుల్లా చెల్లింపవవలసి యుండును. అటులే, తక్కిన యాస్తుల విలువ, వాటి సంఖ్యతోనిమిత్తము లేకుండా, నిర్ణీత మొత్తము నకు చేరినపుడు హుఖుఖుల్లా చెల్లింపవలసి యుండును. హుఖుఖుల్లా చెల్లింపు ఒక్కసారికి మించి యుండదు. ఉదాహరణకు, ఒకడు వెయ్యి మిష్కల్‌ల స్వర్ణమునార్జించి దానిపై హుఖుఖుల్లా చెల్లించినచో, నా మొత్తముపై వాణిజ్య, వ్యాపారముల మూలముగ అదనముగ చేరిన దానిపై తప్ప, చెల్లించు బాధ్యత యుండదు. వ్యక్తి లాభార్జన నిర్దేశిత మొత్తమునకు  సమానమైనపుడు భగవంతు డాజ్ఞాపించిన దానిని నిర్వర్తింపవలె. అసలు మొత్తము చేతులు మారినపుడు ఆ మొత్తముపై, దానిని ప్రథమార్జనగానే భావించి, హుఖుఖుల్లా చెల్లింపవలసి యుండును. తన స్వాధీనమం దేది యున్నను, దాని మూల్యముపై హుఖుఖుల్లా చెల్లింపవలెనని “సర్వప్రథమ బిందువు” సూచించినాడు; అయినను, మహాశక్తియుతమగు ఈ సంవిధానమున, ఆవశ్యకములగు గృహోపకరణములను, గృహమును హుఖుఖుల్లా చెల్లింపునుండి మేము మినహాయించినాము.

9. ప్రశ్న: దివంగతుని హుఖుఖుల్లా చెల్లింపులు, ఋణాలు, అంత్యక్రియల, ఖనన సంబంధములైన ఖర్చులు - వీటిలో దేనికి ప్రాధాన్యత? 

 జవాబు: అంత్యక్రియలకు, ఖనన వ్యయములకు ప్రాధాన్యత ; ఆపై ఋణముల పరిష్కారము, తద నంతరమే హుఖుఖుల్లా చెల్లింపు. దివంగతుని ఋణముల పరిష్కారమునకు ఆతని యాస్తి చాలనిచో , నాతని యాస్తిపాస్తులను అప్పుల దామాషాలో పంపిణీ చేయవలె.

10. ప్రశ్న: కితాబ్-ఎ-అఖ్దస్‌లో సమూల శిరఃకేశఖండన నిషేధించ బడినది; కాని,సురే-ఇ-హజ్ విధించ బడినది.

జవాబు: కితాబ్-ఎ-అఖ్దస్‌కు విధేయులై యుండుట అందరి విధి. అందు ఆవిష్కృతమైనదంతయు ఆయన సేవకులకు దైవశాసనం. పవిత్రగృహమును సందర్శించు తీర్ధయాత్రికులు శిరోముండనమును గావించుకొనవలెనన్న యాజ్ఞ తొలగింపబడినది.

11. ప్రశ్న: నిరీక్షణ సంవత్సరంలో దంపతుల మధ్య సంయోగము జరిగి, ఆపై తిరిగి విరోధం పొడసూపి విడిపోయిన పక్షంలో, వారు తమ ఎడబాటు కాలాన్ని పునఃప్రారంభించాలా? లేక తమ సంయోగానికి ముందు కాలాన్ని, నిరీక్షణ సంవత్సరకాలంలో భాగంగా పరిగణించవచ్చా? ఒకసారి విడాకులు తీసుకోవడమంటూ జరిగిన తరువాత, యింకా నిరీక్షణను పాటించడం అవసరమా?

జవాబు: నిరీక్షణాకాలమున దంపతుల మధ్య తిరిగి అనురాగము ప్రభవిల్లెనేని, ఆ వివాహబంధము సక్రమమే కనుక, భగవంతుని దివ్యగ్రంథము నందాజ్ఞాపితమైన దానిని పాటింపవలె; కాని, నిరీక్షణ సంవత్సర మొకపర్యాయము పరిసమాప్తమై దైవనిర్దేశితము సంభవించిన మీదట, ఇక నిరీక్షింప నక్కర లేదు. నిరీక్షణా వత్సరమున భార్యాభర్తల మధ్య లైంగికసంభోగము నిషిద్ధం; ఈ చర్యకు పాల్పడినవారు భగవంతుని క్షమాభిక్ష నర్ధింపవలె. ఇంకను, అపరాధశుల్కముగ న్యాయ మందిరమునకు పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణమును ముట్టజెప్పవలె.

12. ప్రశ్న: వివాహ ప్రవచనములను పఠించి, వివాహశుల్కం చెల్లింపు జరిగిన తదుపరి, ఆ దంపతుల మధ్య వైషమ్యం తలయెత్త్తినప్పుడు, నిరీక్షణావత్సరాన్ని పాటించకుండానే విడాకులు సంభవించునా?

 జవాబు: వివాహ ప్రవచనములను ఉచ్చరించి, వివాహశుల్కము చెల్లింపబడిన పిదప సైతము ధర్మ బద్ధముగా విడాకులను కోరవచ్చును; అయితే అది, వివాహసమాగమమునకు పూర్వమే జరగవలె. అట్టి పరిస్థితులయందున నిరీక్షణావత్సరమును పాటించనవసరము లేదు. కాని, చెల్లింపబడిన వివాహ శుల్కమును, తిరిగి స్వాధీనపరచుకొనుటకు అనుమతి లేదు.

13. ప్రశ్న: వివాహానికి యిరుపక్షాల తల్లిదండ్రుల సమ్మతి అత్యావశ్యకమా లేక ఒకపక్షం వారి తల్లిదండ్రులు సమ్మతిస్తే సరిపోతుందా? ఈ నియమము కేవలం కన్యలకేనా, లేక యితరులకు సైతం వర్తిస్తుందా ?

 జవాబు: వివాహ మిరువర్గముల తల్లిదండ్రుల సమ్మతి యను నిబంధనకు కట్టుబడియున్నది; ఈ విషయమున వధువు కన్యా, కాదా యను వివక్ష లేదు.

14. ప్రశ్న: అనివార్య ప్రార్ధనాలాపన సమయంలో ఖిబ్ల్లేహ్ దెసకు అభిముఖులు కావడం విశ్వాసులకు నిర్దేశిత మైనది; మరి ఇతర ప్రార్ధనలను, భక్తిగీతాలను ఆలపించేటప్పుడు ఏ దిశకు అభిముఖులు కావాలి?

 జవాబు: అనివార్య ప్రార్ధనల ఆలాపనా సమయమున ఖిబ్ల్లేహ్ దెసకు అభిముఖులు కావలెననునది నిర్ధారిత నియమము. తక్కిన ప్రార్థనలను, భక్తిగీతములను ఆలపించు సమయమున “నీ వేదిశకు అభిముఖుడ వైనను, భగవంతుని వదనముండు” నని ఖురాన్‌లో వెలువరింపబడిన భగవత్ప్రవచన మును మన మనుసరింపవలె.

15. ప్రశ్న: మష్రిఖుల్-అఝ్కార్‌లో ప్రభాతసమయాన గావించదగిన దైవస్మరణ గురించి.
 
 జవాబు: “ప్రభాతవేళ” యని భగవంతుని దివ్యగ్రంథమున ప్రవచింపబడినను, ప్రభాత, సూర్యోదముల మధ్యగల తొలిసంధ్యా సమయమైను, సూర్యోదయానంతరము రెండు గంటల వరకైనను దైవసమ్మతమే.

16. ప్రశ్న: మృతదేహాన్ని ప్రయాణకాలం ఒక గంటకు మించి పట్టేంత దూరానికి తరలించకూడదు అనే శాసనం భూమార్గాన, సముద్రమార్గాన గావించే తరలింపులు రెండింటికీ వర్తిస్తుందా?

16. జవాబు: ఓడయందైనను, రైలునందైనను ప్రయాణ దూరము ఒక్క గంట అయిఉండవలెనను ఈ యాదేశము భూ, సముద్ర మార్గములు రెండింటికిని అనువర్త్తించును; రవాణా మార్గమేదైనను ప్రయాణ మొక్క గంటకు మించరాదన్నదే ఉద్దేశ్యము. ఏదేమైనను, ఖననక్రియ ఎంత శీఘ్రముగ జరిగిన అంత సముచితము, సమ్మతము.

17. ప్రశ్న: ఇతరులు పోగొట్టుకున్న ఆస్తి కనుగొనబడినప్పుడు పాటించ వలసిన పద్ధతి ఏమిటి?

 జవాబు : అట్టి యాస్తి ఏదైనను పట్టణమున తారసిల్లిన, ఆ యంశమును పట్టణ చాటింపుదారునిచే నొక్కపర్యాయము చాటింపు వేయింపవలె. అప్పుడా యాస్తి స్వంతదారు డగుపించినచో దాని నాతనికి యిచ్చివేయ వలె. లేనిచో, నా యాస్తిని కనుగొనిన వ్యక్తి ఒక్క ఏడాది వరకు నిరీక్షింపవలె; ఈ లోపున ఆస్తి యజమానిని గురించి తెలియవచ్చినచో, నాతని నుండి చాటింపుదారుని శుల్కమును వసూలు చేసికొని ఆస్తిని అప్పగింపవలె; ఆస్తి స్వంతదారుడు ఒక సంవత్సరకాలము పాటు అగుపించనిచో, నిక ఆ యాస్తిని కనుగొనినవాడే స్వాధీనపరచుకొనవచ్చును. దొరకిన యాస్తి విలువ చాటింపుదారుని భృతికి సమముగనో, తక్కువగనో యుండిన, దానిని కనుగొనిన వ్యక్తి ఒక రోజు నిరీక్షించి, అప్పటికిని దాని స్వంత దారుడెవ్వడో తెలియరానిచో, తానే దానిని సముచితరీతిన వినియోగింప వచ్చును; ఇక నిర్జన ప్రదేశమున కనుగొనబడిన యాస్తి విషయము: దానిని కనుగొనినవాడు మూడు దినములపాటు నిరీక్షింపవలె; అప్పటికిని స్వంతదారుని జాడ తెలియరానిచో, దానిని కనుగొనిన వ్యక్తికి సదరు ఆస్తిని స్వాధీనపరచుకొను స్వేచ్ఛ కలదు.

18. ప్రశ్న: శుద్ధీకరణలకు సంబంధించి, ఉదాహరణకు: ఒక వ్యక్తి అప్పుడే శరీరమంతా తడిసేలా స్నానం చేసినప్పటికీ, శుద్ధీకరణలను చేసుకోవలసినదేనా?

 జవాబు: శుద్ధీకరణకు సంబంధించిన శాసనమును, ఏ పరిస్థితి యందైనను పాటింపవలె.

19. ప్రశ్న: ఒక వ్యక్తి తన దేశం నుండి వలస పోదలచినపుడు, అతని భార్య అందుకు వ్యతిరేకించడమూ, ఆ అసమ్మతి విడాకులకు దారితీయడమూ జరిగి, ఆతని ప్రయాణసన్నాహాలకు ఒక సంవత్సరానికి పైగా పడితే, ఆ సంవత్సర కాలాన్ని నిరీక్షణా వత్సరంగా పరిగణించవచ్చునా? లేక ఆ దంపతులు విడి పోయిన దినాన్నే వారి నిరీక్షణా వత్సరానికి ఆరంభంగా పరిగణించవచ్చునా?

 జవాబు: భర్త బయలుదేరి పోవుటకు ఒక సంవత్సరమునకు పూర్వము నుండియే ఆ దంపతులు విడిగా ఉంటున్నందువల్ల, వారి నిరీక్షణా వత్సరమును లెక్కించుటకై, వారు విడిపోయిన దినమునే ప్రారంభదినముగ పరిగణింపవలె. ఒక వేళ, వారి మధ్య అనురాగ సౌరభములు తిరిగి పరిమళించనిచో, విడాకులు చోటుచేసుకొన వచ్చును. అట్లు కాదేని, భర్త వెడలిపోయిననాటినుండియే, నిరీక్షణా వత్సరమును గణియింపుచు, కితాబ్-ఎ-అఖ్దస్ నందు అనుసూచితములైన నియమములను పాటింప వలె.

20. ప్రశ్న: మతపరమైన బాధ్యతలకు సంబంధించిన యుక్త వయస్సు గురించి.

 జవాబు: యుక్తవయ స్సనునది స్త్రీ, పురుషులిరువురికిని పదునైదేండ్లు.

21. ప్రశ్న: “ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు . . . చేయలేకపోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగప్రణామము నాచరింప వలె” నన్న పవిత్ర ప్రవచనం గురించి.

 జవాబు: ప్రయాణావస్థయందునను, అభద్రతాస్థితి కారణమునను, వదలి వేయబడిన ప్రార్థనలకు ఈ సాష్టాంగ ప్రణామమే పరిహారం. ఒక వేళ ప్రార్థనా సమయమునకు, విశ్రమించుట కనువైన సురక్షిత ప్రదేశం లభ్యమైనచో, ప్రయాణీకుడు ఆ ప్రార్థనను ఆలపింపవలె. ఈ పరిహారప్రణామమునకు సంబంధించిన ఏర్పాటు ఇంటియందునను, ప్రయాణమందునను వర్తించును.

22. ప్రశ్న: ప్రయాణానికి నిర్వచనం గురించి.(ఇది ప్రయాణికుడికి ఉపవాసమునుండి మినహాయింపు నిచ్చు కనీస కాలపరిమితిని గురించి)

 జవాబు: గడియారము ననుసరించి ప్రయాణకాలపరిమితి తొమ్మిది గంటలని నిర్వచనము. ఏ ప్రయాణీకుడైనను ఒకచోట ఆగి, బయాన్ గణన ప్రకారం ఒక మాసమునకు తక్కువ కాకుండ తానక్కడ విశ్రమింపగలనని భావించినచో, ఉపవాసమును పాటించుట ఆతని విధి; కాని, మాసమునకు తక్కువైనచో నాతనికి ఉపవాసమునుండి మినహాయింపు ఉండును. ఒక వేళ అతడు ఉపవాస మాసమున, బయాన్ ప్రకారము, ఒక మాసంపాటు ఉండు నిమిత్తమై ఒక ప్రదేశమునకు చేరుకొనినచో, మొదటి మూడు దినములు పూర్తియగునంత వరకును ఉపవసింపరాదు, ఇక ఆపై మిగిలిన వ్యవధి యందుపవసింపవలె. అయితే, ఆతడు తన శాశ్వత నివాసమునకు చేరెనేని, చేరిన తొలినాటినుండియే ఉపవసింపవలె.

23. ప్రశ్న: జారులకు, జారిణులకు విధించే శిక్షల గురించి.
 
జవాబు: మొదటి తప్పుకు తొమ్మిది, రెండవ తప్పుకు పద్ధెనిమిది, మూడవదానికి ముప్పదియారు మిష్కల్‌ల సువర్ణము ఇలా . . . ప్రతి ఉత్తరాపరాధమునకును, పూర్వపు జరిమానా రెట్టింపగునటుల చెల్లింపులు జరుగవలె. బయాన్ నిర్దేశానుసారముగ, ఒక మిష్కల్ బరువు పంధొమ్మిది నాఖుద్ లకు సమానము.

24. ప్రశ్న: వేటాడటం గురించి.

జవాబు: ఆయన, ఆయన మహోన్నతుడగు గాక : “మీరు ఆహారమునకై మృగములనో, పక్షులనో వేటాడవలసి వచ్చెనేని,” ఇత్యాదిగా వచించినాడు. ధనుర్బాణములును, తుపాకులును, వేటయం దుపయోగించు సంబంధిత సాధనసామగ్రి వంటి ఇతర విధానములు సైతము చేర్పబడినవి. ఏమైనను, ఒకవేళ బోనులు, ఉచ్చులు ఉపయోగింప బడినచో, వాటియందు తగులుకొనిన ఎర, దానిని సమీపింపక పూర్వమే మృతినొందినచో, దాని నాహారముగ స్వీకరించుట న్యాయబద్ధము కాదు.

25. ప్రశ్న: తీర్ధ యాత్రకు సంబంధించి. 

జవాబు: పావన గృహద్వయ మందొకదానికి తీర్ధయాత్రను చేయుట విధాయకము; అయితే, దేనిని సందర్శింపవలెనో నిర్ణయించుకోవలసినది యాత్రీకుడే.

26. ప్రశ్న: వివాహ శుల్కానికి సంబంధించి.
 
జవాబు: వివాహశుల్కమునకు సంబంధించి, వ్యక్తి మనస్ఫూర్తిగా సంతుష్టినొందవలసినదని ఆశింపబడిన కనిష్ఠస్థాయి పంధొమ్మిది మిష్కల్‌ల రజతము.

27. ప్రశ్న: “అయితే, ఒకవేళ తన పతి మరణ లేదా హత్యా సమాచార మామెకు చేరెనేని,” అనే పవిత్ర ప్రవచనానికి సంబంధించి.
 
జవాబు: నిరీక్షణకు సంబంధించి  “నిర్దిష్ట సంఖ్యగల మాసముల” విషయమున తొమ్మిది మాసముల వ్యవధి నిర్ణయింపబడినది.

28. ప్రశ్న: వారసత్వపుటాస్తిలో ఉపాధ్యాయుని వాటా గురించి మరొక మారు ప్రశ్నించబడింది.

 జవాబు: ఉపాధ్యాయుడు పరమపదించెనేని, ఆతడికి సంక్రమింప వలసిన వారసత్వపుటాస్తి వాటాలో మూడింట ఒక వంతు న్యాయ మందిరమునకు మరలింపబడును; తక్కిన రెండు వంతులు దివంగతుని వారసులకు చెందునే తప్ప, ఉపాధ్యాయుని సంతానమునకు మాత్రము కాదు.

29. ప్రశ్న: తీర్ధయాత్ర గురించి మరొకమారు ప్రశ్నించబడింది. 

 జవాబు: మానవులకు నిర్దేశితమైన పావనగృహ తీర్థయాత్ర, బాగ్దాద్ నందలి మహత్తర గృహమున కును, షిరాజ్‌నందలి సర్వప్రథమ బిందువు గృహమునకును ఉద్దేశితమైనది. వీటిలో దేనిని సందర్శించి నను సరి పోవును; తమ నివాస స్థానములకు చేరువయందున్న గృహమును వారు సందర్శింప వచ్చును.

30. ప్రశ్న: “తన సేవకై యొక సేవికను గైకొను నాతడు సముచితరీతిన వర్తింపవలె,”నన్న ప్రవచనం గురించి.

 జవాబు: ఇది పూర్తిగా - యవ్వనమందున్నవారైనను, వృద్ధులైనను - వేతనమునకు సేవలనందించు తక్కిన సేవకవర్గీయులకు సంబంధించినదే;  అట్టి పరిచారికకు తనకు నచ్చిన తరుణమున భర్తను ఎంచుకొను స్వేచ్ఛ యున్నది. ఏలయన, ఆ స్త్రీని కొనుగోలు చేయుటకాని, మానవునకు ఇరువురికి మించి భార్యలుండుట కాని - నిషిద్ధము.

31. ప్రశ్న: “మీరు ముమ్మారు పలికి స్త్రీకి విడాకులనిచ్చు పూర్వవిధానము నవలంబించుటను పరమాత్ముడు . . . నిషేధించినా” డనే పవిత్ర ప్రవచనం గురించి. 

 జవాబు: ఇది - విడాకులు పొందిన మహిళ తన పూర్వపు భర్తను పునర్వివాహం చేసుకునేందుకై, ముందుగా ఆమెను వేరొక పురుషుడు వివాహము చేసుకొని యుండుటను ఆవశ్యకం గావించిన పురాతన శాసనమునకు సంబంధించింది; కితాబ్-ఎ-అఖ్దస్ నందీ విధానము నిషేధింపబడినది.

32. ప్రశ్న: పవిత్రస్థలద్వయమందలి పావన గృహముల, తక్కిన సింహాసన ప్రతిష్ఠిత ప్రదేశాల స్వాధీన, పరిరక్షణలకు సంబంధించి:

 జవాబు: గృహద్వయ మనగా, మహత్తర గృహమని, సర్వప్రథమ బిందువు నివాసమని అభిప్రాయం. ఇక ఇతర స్థలములను గురించి : అవి నెలకొనియున్న ప్రాంతవాసులు దివ్యధర్మ సింహాసన ప్రతిష్ఠిత స్థలముల యందన్నింటిని, లేదేని ఒక్క దానినైనను సంరక్షింప సమకట్టవలె.

33. ప్రశ్న: వారసత్వపుటాస్తిలో  ఉపాధ్యాయునికి  సంక్రమించే వాటా గురించిన పునర్విచారణ.

 జవాబు: ఉపాధ్యాయుడు బహాజనులయందలి వాడు కానిచో, వారసత్వపుటాస్తియం దాతనికి వాటా సంక్రమింపదు. ఉపాధ్యాయులు అనేకులున్నచో, సంబంధిత వాటాను వారికి సమముగా పంచవలె. ఉపాధ్యాయుడు దివంగతుడైనచో, నాతని సంతతికి వారసత్వపుటాస్తిలో వాటా సంక్రమింపదు; అందుకు బదులుగా, ఆస్తిలో మూడింట రెండు వంతులు యజమానుని సంతతికిని, తక్కిన ఒక్క వంతు న్యాయ మందిరమునకును మరలింపబడును.

34. ప్రశ్న: నివాసగృహం ప్రత్యేకించి మగసంతతికే చెందడానికి సంబంధించి.

జవాబు: నివాసగృహము లనేకములున్నచో, వాటియం దుత్తమము, శ్రేష్ఠమైనదని భావము. మిగిలిన గృహములను తక్కిన ఆస్తులతోపాటుగా వారసులందరికిని పంపకము చేయవచ్చును. ఏ వారసుడైనను - ఏ వర్గమునకు చెందిన వారసుడైనను సరియే - భగవంతుని దివ్యధర్మమునకు చెందనివాడైనచో, నాతడిక జీవరహితునిగనే గణియింపబడును; ఆతడికి వారసత్వపరమగు హక్కు ఉండదు.

35. ప్రశ్న: నౌరూజ్ గురించి. 

జవాబు: సూర్యాస్తమయమునకు ఒక్క నిమిషము ముందుగ సంభవించినను, సూర్యుడు మేషరాశిూ యందు ప్రవేశించు రోజే నౌరూజ్ పర్వదినము.

36. ప్రశ్న: జన్మదినద్వయ వార్షికోత్సవాలలో ఏ ఒక్కటి కాని, లేక బాబ్ దివ్యప్రకటనా వార్షికోత్సవంకాని ఉపవాసకాలంలో సంభవిస్తే ఏం చేయాలి.

జవాబు: ఉపవాసకాలమున జన్మదినద్వయ వార్షికోత్సవములను కాని, బాబ్ దివ్యప్రకటనాదిన వేడుక లను కాని జరుపుకోవలసి వచ్చినచో, ఆ రోజున ఉపవాస నియమము వర్తింపదు.

37. ప్రశ్న: వారసత్వాన్ని నిర్ధారించే పవిత్ర నియమాలలో దివంగతుని నివాసం, వ్యక్తిగతమైన దుస్తులు పురుష సంతానానికే కేటాయింపబడినాయి. ఈ ఏర్పాటు కేవలం పిత్రార్జితానికే వర్తిస్తుందా, లేక తల్లి ఆస్తికి కూడానా?

జవాబు: తల్లి వినియోగించిన దుస్తులను కుమార్తెలకు సమముగ పంచవలె; స్థలములు, ఆభరణములు, వాడని వస్త్రములతో సహా ఇతరత్రా ఆస్తిపాస్తులను మాత్రము కితాబ్-ఎ-అఖ్దస్‌లో వెల్లడింపబడిన విధానముననుసరించి ఆమె వారసులందరికిని పంపిణీ చేయవలె. కాని, దివంగతురాలికి కుమార్తెలు లేనిచో, నామె యావదాస్తిని పవిత్ర గ్రంథమున పురుషులకై ప్రత్యేకింపబడిన విధానములో పంపకము చేయవలె.

38. ప్రశ్న: ఒక సంవత్సర నిరీక్షణ కాలానంతరం చోటు చేసుకోవలసిన విడాకుల గురించి; ఇరువురిలోను, కేవలం ఒక్కరే రాజీకి ఇష్టతను కనపరచినపుడు ఏం చేయాలి? 

 జవాబు: కితాబ్-ఎ-అఖ్దస్‌నం దావిష్కృతమైన శాసనము ననుసరించి యిరుపక్షములును సంతృప్తి నొందవలె; ఇరువురికిని యిష్టము లేనిచో పునస్సమాగమము సాధ్యము కాదు.

39. ప్రశ్న: వివాహశుల్కానికి సంబంధించి, వరుడు పూర్తి మొత్తం చెల్లించలేక, అందుకు బదులు, తనకు స్తోమత ఉన్నప్పుడు చెల్లించగలనన్న అవగాహనతో, వివాహమహోత్సవ సమయంలో లాంఛన ప్రాయంగా ఒక వాగ్దానపత్రాన్ని వ్రాసి వధువుకు ఇవ్వవచ్చునా?

 జవాబు: ఈ పద్ధతి నవలంబించుటకై  ‘దివ్యాధికార మూలము’ నుండి అనుమతి అనుగ్రహింప బడినది.

40. ప్రశ్న: నిరీక్షణావత్సర కాలంలో భార్య భర్తల యెడ అనురాగసౌరభం పునఃపరిమళించి, ఆపై తిరిగి వైషమ్యమేర్పడి, మిగిలిన ఏడాది అంతా సుముఖత, విముఖతల మధ్య ఊగిసలాటతో గడిచి, చివరికి మళ్లీ వైషమ్యానిదే పైచేయి ఐతే, విడాకులు చోటు చేసుకుంటాయా, లేదా?

 జవాబు: వైషమ్య మేర్పడిన ప్రతి పర్యాయమును, ఆనాటి నుండి నిరీక్షణావత్సర మారంభమగును; సంవత్సరకాలపు నిరీక్షణ పూర్తి కావలె.

41. ప్రశ్న: దివంగతుని నివాసం, దుస్తులు స్త్రీ సంతతికో, యితర వారసులకో కాక, ఆతని పురుష సంతానా నికే కేటాయించబడ్డాయి. మృతునికి మగ సంతతికి లేనప్పుడు ఏం చేయాలి?
 
 జవాబు: ఆయన, ఆయన మహోన్నతుడగు గాక, ఇట్లు ప్రవచించినాడు: “మృతినొందినవానికి సంతానము లేనిచో, వారి వాటా . . . న్యాయ మందిరమునకు చెందవలె.” ఈ పవిత్ర ప్రవచనము ననుసరించి, నివాసమును, వ్యక్తిగత వస్త్రములును న్యాయమందిరమునకు మరలింప బడును.

42. ప్రశ్న: హుఖుఖుల్లా శాసనం కితాబ్-ఎ-అఖ్దస్‌లో వెలువరించ బడింది. హుఖుఖుల్లా చెల్లింపు అనువర్తించే ఆస్తిలో నివాసం - అందలి వస్తుసంచయం, అవసరమైన గృహోపకరణాలతో సహా - చేరుతుందా లేక దానిని మరో విధంగా లెక్కగట్టవలసి ఉంటుందా?

 జవాబు: పారశీకమున మేము వెలువరించిన శాసనముల ననుసరించి ఈ మహాదివ్యావిష్కరణ యుగమున హుఖుఖుల్లా చెల్లింపు నుండి గృహమును, గృహోపకరణములును మినహాయింప బడినవి; అనగా నవి అత్యవసరమైనవిగ నెంచబడినవి.

43. ప్రశ్న: యుక్తవయస్సునకు పూర్వమే ఒక బాలికకు వివాహనిశ్చయం లేదా ప్రధానం చేయడం గురించి.

 జవాబు: ఈ సంప్రదాయము శాసనవిరుద్ధమని ‘దివ్యాధికార మూలము’ చే ప్రకటితమైనది, అదియును గాక, వివాహమునకు తొంభైఐదు దినములకు పూర్వమే వివాహమును గురించి ప్రకటించుట శాసన విరుద్ధము.

44. ప్రశ్న: ఉదాహరణకు ఒక వ్యక్తివద్ద నూరు తూమానులు ఉండి, ఆ మొత్తంపై హుఖుఖుల్లా చెల్లించి, సదరు మొత్తంలో సగాన్ని విఫల వ్యవహారాల్లో కోల్పోయి, తిరిగి వ్యాపారంలో హుఖుఖ్ చెల్లించదగిన మొత్తాన్ని సంపాదించిన పక్షంలో అప్పుడు ఆ వ్యక్తి ఆ మొత్తంపై హుఖుఖ్‌ను చెల్లించాలా, వద్దా?

 జవాబు: అట్టి సందర్భమున హుఖుఖ్‌ను చెల్లింపనవసరము లేదు.

45. ప్రశ్న: ఒకవేళ హుఖుఖుల్లా చెల్లింపు జరిగిన తరువాత, ఈ నూరు తూమానుల మొత్తం పూర్తిగా నష్టమైపోయి, ఆ మీదట వాణిజ్యరీత్యా ఆ మొత్తం తిరిగి ఆర్జించడం జరిగితే, దానిపై రెండవసారి హుఖుఖ్‌ను చెల్లించవలసి ఉంటుందా, ఉండదా?

 జవాబు: ఈ సందర్భమునను హుఖుఖుల్లాను చెల్లింప నవసరము లేదు.

46. ప్రశ్న: “పరమేశ్వరుడు మీకు వివాహమును నిర్దేశించినా” డను పవిత్ర ప్రవచనమునకు సంబంధించి : ఈ నిర్దేశాన్ని పాటించడం అనివార్యమా, కాదా?

 జవాబు : అనివార్యము కాదు.

47. ప్రశ్న: ఒక వ్యక్తి ఒకానొక స్త్రీని, కన్య అని నమ్మి, వివాహశుల్కాన్ని చెల్లించి వివాహం చేసుకున్నా డనుకుందాం; అయితే, సమాగమ సమయంలో ఆమె కన్య కాదని స్పష్టంగా తేలినప్పుడు, అయిన ఖర్చులను, వివాహశుల్కాన్ని తిరిగి ఇచ్చివేయాలా, వద్దా? వివాహం కన్యాత్వ ప్రాతిపదికన నిశ్చయమై, ఆ నిబంధన పాటింపబడనపుడు, మరి ఆ వివాహ నిశ్చయం చెల్లుతుందా?

 జవాబు: అట్టి స్థితియందు ఖర్చులను, వివాహశుల్కమును తిరిగి చెల్లించివేయవలె. ఏ ప్రాతిపదికన వివాహ నిశ్చయము జరిగినదో, ఆ నియమము పాటింపబడనిచో ఇక, ఆ నిశ్చయము చెల్లనేరదు. అయినను, ఆ యంశమును మరుగుపరచి క్షమియింపగలుగుట, భగవంతుని      దృష్టియందనుగ్రహాన్విత పురస్కారముగ ఔన్నత్యము నొందును.

48. ప్రశ్న: “విందును గావించుట . . . మీకు విధియింపబడినది” ఇది అనివార్యమా, కాదా?

 జవాబు: అనివార్యము కాదు.

49. ప్రశ్న: వ్యభిచారము, స్వలింగసంపర్కము,దొంగతనము - వీటికి సంబంధించిన అపరాధ శుల్కములు, వాటి స్థాయిలకు సంబంధించి.

 జవాబు: ఈ యపరాధ శుల్కముల స్థాయిని నిర్ధారించు అధికారము న్యాయమందిరమునకే కలదు.

50. ప్రశ్న: స్వబాంధవులను వివాహం చేసుకోవడంలో గల ఔచిత్యం లేదా అనౌచిత్యం గురించి. 

 జవాబు : పైన పేర్కొనినట్లు, ఈ యంశములును న్యాయమందిర ధర్మకర్తలకు సంబంధించినవే.

51. ప్రశ్న: శుద్ధీకరణములకు సంబంధించి “ప్రక్షాళనకు జల మలభ్యమైన యాతడు పరమ పావనుడగు, “పరమ పావనుడగు భగవంతుని దివ్యనామము పేరిట” యను పదముల నైదు పర్యాయములు పలికి  . . .” అని వెలువరింప బడినది. ఈ ప్రవచనాన్ని చలితీవ్రతలో కాని, ముఖానికి లేదా చేతులకు దెబ్బలు తగిలినప్పుడు ఉచ్చరింపవచ్చునా?

 జవాబు: చలి తీవ్రముగ నున్నప్పుడు ఉష్ణోదకమును ఉపయోగింప వచ్చును. చేతులకును, లేదా ముఖమునకు గాయములైనను, లేక నీటి వాడకమున నొప్పులు, బాధలు కలిగి, తద్వారా నీటి వినియోగమే హానికరమైనచో, ప్రక్షాళన స్థానమున నిర్ణీత ప్రవచనము నాలపింపవచ్చును.

52. ప్రశ్న: సంకేతాల ప్రార్థనకు ప్రతిగా వెలువరించబడిన ప్రవచనాన్ని ఆలపించడం అనివార్యమా?

 జవాబు : అనివార్యము కాదు.

53. ప్రశ్న: వారసత్వానికి సంబంధించి స్వంత సోదరీ, సోదరులుండగా తల్లి పక్షానగల సవతి సోదరీ, సోదరు లకు వారసత్వాస్తిలో వాటా లభిస్తుందా?

 జవాబు: వారికి వాటా లభించదు.

54. ప్రశ్న: ఆయన - ఆయన మహోన్నతుడగుగాక - యిలా ప్రవచించాడు : “మృతుడు జీవించియుండగనే, సంతానవంతుడగు ఆతని కుమారుడు దివంగతుడయ్యెనేని . . . ఆ సంతతి తమ తండ్రి వాటాకు వారసులగుదురు.” మరి, తండ్రి జీవించి ఉండగానే కూతురు మరణిస్తే ఏం చేయాలి?

 జవాబు: ఆమె వారసత్వపు వాటాను సప్తవర్గములకు చెందిన వారసులకు, దివ్యగ్రంథ శాసనాను సారముగ పంపకము చేయవలె.

55. ప్రశ్న: మృతిచెందినది మగువ ఐతే “భార్య” తాలూకు వారసత్వపు వాటా ఎవరికి కేటాయించబడింది?

 జవాబు: “భార్య” వారసత్వపు వాటా “భర్త” కు కేటాయింపబడినది.

56. ప్రశ్న: మృతదేహానికి చుట్టవలసిన వస్త్రములు ఐదుగా నిర్దేశితం కావడం గురించి : ఐదు వస్ర్తాలు అంటే ఇంత వరకూ ఆచారంగా వస్తున్న ఐదు విడి వస్త్రాలు అనా, లేక పొడవైన వస్త్రం ఒకదానిని చుట్టుమీద చుట్టుగా ఐదుసార్లు చుట్టడం అనా?

 జవాబు: ఐదు వస్త్రములను వినియోగింపవలె ననునదే భావము.

57. ప్రశ్న: ఆవిష్కృతమైన ప్రవచనాలలో కొన్నింటి మధ్యగల వ్యత్యాసాల గురించి.

 జవాబు: ఆవిష్కృతమైన ఫలకములయందనేకములు, సరిచూడకనే, పునరావలోకనము చేయకనే యధాతధముగ విడుదల చేయడమైనది. పర్యవసానముగ నవి, ఆజ్ఞాపించిన విధంగా, ధర్మవిరోధుల దురాక్షేపణలకు పూర్వమే వ్యాకరణ సాంప్రదాయముల కనుగుణముగ సరిచూడబడుటకై పవిత్ర సాన్నిధ్యమున పునఃపఠింపబడినవి. ఈ యాచరణకు మరియొక హేతువేమనగా అగ్రగామి - ఆయన దక్క తక్కిన వారి ఆత్మలన్నియు ఆయనకై అర్పితములగు గాక - అనుసరించిన వినూత్నశైలియందు వ్యాకరణ సూత్రావలంబన పట్ల స్వేచ్ఛను గమనింపవచ్చును; అక్కారణముననే, పవిత్ర ప్రవచనముల యందధికాంశము - అవగాహనాసౌలభ్యము, సంక్షేప వ్యక్తీకరణముల నిమిత్తమై ప్రస్తుత వ్యావహారికమున కనువుగ వెలువరింపబడినవి.

58. ప్రశ్న: “ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు . . . చేయలేకపోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగ ప్రణామము నాచరింపవలె” నన్న పవిత్రప్రవచనానికి సంబంధించి; ఈ పరిహారం, అభద్రతావస్థలలో చేయలేకపోయిన అనివార్య ప్రార్థన విషయంలోనేనా లేక ప్రయాణంలో ఉండటం వల్ల అనివార్య ప్రార్థనను మానివేసిన సందర్భంలో కూడానా?

 జవాబు: అనివార్య ప్రార్థనాసమయ మాసన్నమై, భద్రత లేనప్పుడు సురక్షితస్థలమును చేరిన పిదప, అప్పటికి చేయలే పోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానమునం దొక సాష్టాంగ ప్రణామమును గావింపవలె; తుది ప్రణామానంతరము, అర్థపద్మాసనాసీనులై నిర్ణీత ప్రవచనమును పఠియింప వలె. సురక్షిత ప్రదేశమున్నచో, ప్రయాణమున అనివార్య ప్రార్థనను మాననక్కర లేదు.

59. ప్రశ్న: ప్రయాణికుడు విశ్రాంతికై ఒకచోట బసచేసినప్పుడు, అది అనివార్య ప్రార్థనా సమయమైతే, అతడు అనివార్య ప్రార్థన చేయాలా, లేక అందుకు బదులు సాష్టాంగ ప్రణామం చేయాలా?

 జవాబు: అభద్రతాస్థితులయందు తప్ప అనివార్య ప్రార్థనను విడచుటకు అనుమతి లేదు.

60. ప్రశ్న: అనివార్య ప్రార్థనలను చేయలేకపోయినందువల్ల, అనేక సాష్టాంగ ప్రణామాలను చేయవలసివస్తే, పరిహార పూర్వకమైన ప్రతి సాష్టాంగ ప్రణామం తరువాత నిర్దిష్ట ప్రవచనాన్ని పునరుచ్చరించ వలసి ఉంటుందా?

 జవాబు: సాష్టాంగ ప్రణామములయందు చివరిదాని తరువాత నిర్ణీత ప్రవచనమును పఠియించిన చాలును. అనేక సాష్టాంగ ప్రణామము లున్నచో, ప్రతిదాని విషయమునను ప్రత్యేకించి ప్రవచనమును పునరుచ్చరింప నవసరము లేదు.

61. ప్రశ్న: ఒకవేళ నివాసంలో కూడా అనివార్య ప్రార్థనను విడిచిపెడితే సాష్టాంగ ప్రణామంతో పరిహారం చెల్లింప వచ్చునా లేదా?

 జవాబు: ఇతఃపూర్వము వేయబడిన ప్రశ్నలకు సమాధానముగా “పరిహారపూర్వకమగు ఈ సాష్టాంగ ప్రణామము, ఇంటియొద్దను, ప్రయాణమునను రెండింటికిని వర్తించు” నని వ్రాయబడినది.

62. ప్రశ్న: ఒకవేళ మరెందు కోసమో శుద్ధీకరణలు గావించుకున్నప్పుడు, అనివార్యప్రార్ధనాసమయం వచ్చినప్పుడు ఆ శుద్ధీకరణలు సరిపోతాయా, మరలా శుద్ధీకరణలను చేయవలెనా?

 జవాబు: ఈ శుద్ధీకరణలు చాలు. తిరిగి ప్రత్యేకముగా శుద్ధీకరణలను చేయనక్కరలేదు.

63. ప్రశ్న: తొమ్మిది రకాహ్‌లతో కూడిన అనివార్య ప్రార్థనను ఉదయ, మధ్యాహ్న, సాయంసమయాలలో చేయవలసి ఉంటుందని కితాబ్-ఎ-అఖ్దస్ లో నిర్దేశించబడింది; అయితే అనివార్య ప్రార్థ్ధనల ఫలకముూ ఇందుకు భిన్నంగా అగుపిస్తున్నది.

 జవాబు: కితాబ్-ఎ-అఖ్దస్‌లో వెలువరించబడినది మరో అనివార్య ప్రార్ధనకు సంబంధించినది. కొన్ని సంవత్సరములకు పూర్వము, వివేకహేతువులుగా, తదనివార్య ప్రార్థ్ధనతో సహా పలు అంశములకు సంబంధించిన కితాబ్-ఎ- అఖ్దస్ శాసనములను వేరుగా ఆవిష్కరించి తక్కిన పవిత్రరచనలతో సహా, భద్రపరచి, పరిరక్షించు నిమిత్తమై పంపివేయడమైనది. తదనంతరమే, ఈ మూడు అనివార్య ప్రార్థనలును ఆవిష్కరింపబడినవి.

64. ప్రశ్న: సమయాన్ని తెలుసుకునేందుకై గడియారాలపై ఆధారపడటం యుక్తమేనా?

 జవాబు: సమయనిర్ణయానికి గడియారములపై నాధారపడుటకు అనుమతి కలదు.

65. ప్రశ్న: అనివార్య ప్రార్థనల ఫలకములో, మూడు ప్రార్థనలు ఆవిష్కరించ బడినాయి; ఈ మూడు ప్రార్థన లను చేయవలసిన అవసరం ఉందా, లేదా?

 జవాబు: ఈ ప్రార్థనాత్రయము నుండి ఒక్కదానిని ఆలపించుట విధాయకము; దేనిని ఆలపించినను చాలును.

66. ప్రశ్న: ఉదయకాల ప్రార్థనకై చేసుకున్న శుద్ధీకరణలు మధ్యాహ్న ప్రార్థనకు చెల్లుతాయా? మరి, అదే విధంగా మధ్యాహ్నం చేసుకున్న శుద్ధీకరణలు సాయంకాలం వరకు చెల్లుతాయా?

 జవాబు: శుద్ధీకరణలు ఏ అనివార్య ప్రార్థనలకై చేయబడుతున్నవో, వాటికే చెందును. ప్రతి ప్రార్థనకును శుద్ధీకరణలను చేసికొనవలె.

67. ప్రశ్న: సుదీర్ఘ అనివార్య ప్రార్థనకు సంబంధించి లేచి నిలిచి “భగవంతుని వైపుకు తిరుగ” వలె. ఇది ఖిబ్లేహ్ వైపుకు తిరగవలసిన అవసరంలేదని సూచిస్తున్నట్లుగా ఉంది; అవునా, కాదా?

 జవాబు: ఇక్కడ భావము - ఖిబ్లేహ్ అనే.

68. ప్రశ్న: “ఉదయ సాయంసంధ్యల యందున భగవత్ప్రవచనములను ఆలపింపు” డను పవిత్ర ప్రవచనము నకు సంబంధించి.

జవాబు: ఇక్కడ ఉద్దేశ్యం : దివ్యోచ్చారణా స్వర్గము నుండి అనుగ్రహీతమైన సకలమును అని. పావన ఆత్మల కుండవలసిన ప్రథమావశ్యకత - భగవత్ప్రవచనమును పఠియింపవలెనను ఆసక్తి, ప్రేమ. బహు గ్రంథపఠనముకన్నను ఆనందాతిరేకమున ఒక్క ప్రవచనమునైనను, ఒక్క పదమునైనను పఠియించుట ఉత్తమము.

69. ప్రశ్న: ఏ వ్యక్తి ఐనా వీలునామాను వ్రాస్తున్నప్పుడు - హుఖుఖుల్లా లేదా ఋణవిమోచనలకు మాత్రమే కాక - దానధర్మాలకై తన ఆస్తిలో కొంత భాగాన్ని కేటాయించవచ్చునా? లేక అతనికి తన అంత్యక్రియల వ్యయాలకు సరిపడే కొంతమొత్తాన్ని కేటాయించుకొని, మిగిలిన ఆస్తినంతటినీ, దైవనిర్ణీత మైన సప్తవర్గవారసులకు చెందేలా చేసే వీలుమాత్రమే ఉన్నదా?

జవాబు: వ్యక్తికి తన యాస్తిపై సంపూర్ణాధికారమున్నది. అతడు హుఖుఖుల్లాను చెల్లింపగలిగి, ఋణ విముక్తుడై యుండెనేని, ఆపై యాతని వీలునామాయందు గావింపబడిన ఏ ప్రకటన యైనను, నిర్ణయ మైనను అంగీకారయోగ్యమే. తన కనుగ్రహీతమైన దానితో తన యిచ్చవచ్చిన రీతిని వ్యవహరించుటకు భగవంతుడాతనిని నిశ్చయముగ ననుమతించినాడు.

70. ప్రశ్న: ఖననాంగుళీయ ధారణ విశేషించి పెద్దలకు మాత్రమేనా, లేక పిల్లలకూ వర్తిస్తుందా?

జవాబు : ఇది పెద్దలకు అనగా వయోజనులకు మాత్రమే. అదేవిధముగ, దివంగతులకు నిర్దేశితమైన ప్రార్థనయును పెద్దల నిమిత్తమే.

71. ప్రశ్న: ‘ఆలా’ మాసంలో కాకుండా మరో సమయంలో ఉపవసించాలని ఎవరైనా ఆశిస్తే, అందుకు అనుమతి ఉన్నదా, లేదా? అలా ఉపవసిస్తానని అతను ప్రతినబూనటం అంగీకారయోగ్యమేనా?

జవాబు: ఉపవాససంబంధితమగు శాసనము ముందే ఆవిష్కృతమైనది. అయినను, తన యభీష్టము నెరవేరుటకో, మరేదైనా లక్ష్యసాధన నిమిత్తమో ఎవరైనను భగవంతునికి ఉపవాసము నర్పింపనెంచిన అది యిప్పుడును, మున్ముందును అంగీకృతమే. అయినను, ప్రతినలును, ప్రమాణములును మానవాళికి లాభము నొనగూర్చునవిగ నుండవలెననునదే భగవంతుని - ఆయన మహోన్నత కీర్తిమంతుడగు గాక - యాకాంక్ష.

72. ప్రశ్న: వ్యక్తి నివాసం, వ్యక్తిగత దుస్తులకు సంబంధించి మరో ప్రశ్న వేయ బడింది : పురుషసంతతి లేకపోతే వీటిని న్యాయమందిరానికి మరలించాలా లేక మిగతా ఆస్తి మాదిరిగానే పంపకాలు చేయాలా?

జవాబు: నివాసము, వ్యక్తిగత వస్త్రములకు సంబంధించి మూడింట రెండు వంతులు స్రీ ్తసంతతికి చెందవలె; మూడవ వంతు ప్రజల ఖజానాగా భగవంతునిచే నిర్దేశితమైన న్యాయమందిరమునకు మరలింపబడవలె.

73. ప్రశ్న: ఒక సంవత్సర నిరీక్షణానంతరం భర్త విడాకులివ్వడానికి నిరాకరిస్తే, అప్పుడు భార్య ఏం చెయ్యాలి?

జవాబు: నిర్ణీతకాలము పరిసమాప్తినొందినప్పుడు విడాకులు చోటు చేసుకుంటాయి. అయినను, నిర్ణీతకాలపు టాద్యంతములకు సాక్షులు ఉండుట అవసరము; అవసరమైనచో, నిజనిర్ధారణకు వారి నాహ్వానింప వచ్చును.

74. ప్రశ్న: వృద్ధాప్య నిర్వచనం గురించి.

జవాబు: అరబ్బులకు అవసానదశయే వృద్ధాప్యము; అయితే, బహా ప్రజల కది డెబ్భదియవ సంవత్సరము నుండి.

75. ప్రశ్న: కాలినడకన ప్రయాణించే వ్యక్తికి ఉపవాసపరమైన పరిమితికి  సంబంధించి.

జవాబు: పరిమితి రెండు గంటలుగా నిర్ణయింపబడినది. ప్రయాణము రెండు గంటలకు మించినచో ఉపవాస విరమణకు అనుమతి ఉన్నది.

76. ప్రశ్న: ఉపవాసమాసంలో కఠినశ్రమలో నిమగ్నులైనవారు ఉపవాసాన్ని పాటించడానికి సంబంధించి.

జవాబు: అట్టి వారిని ఉపవాసము నుండి మినహాయించడమైనది. అయినను, దైవశాసనము పట్ల, దాని మహోన్నతస్థానము పట్ల గౌరవమును చూపుటకై మితముగా, ఏకాంతముగా భుజియించుట ప్రశంసనీయము, సముచితము.

77. ప్రశ్న: అనివార్యప్రార్థనకై చేసుకున్న శుద్ధీకరణలే, మహోన్నతనామాన్ని తొంభై ఐదు సార్లు పునరుచ్చరించడానికి కూడా సరిపోతాయా?

జవాబు : శుద్ధీకరణలను తిరిగి చేసుకోనవసరము లేదు.

78. ప్రశ్న: భర్త భార్యకు కొనియిచ్చిన వస్త్రాభరణాల గురించి : భర్త మరణాంతరం, అవి కూడా వారసులకు పంపిణీ చేయబడాలా లేక భార్యకై ప్రత్యేకించబడాలా?

జవాబు: వాడబడిన దుస్తులు తప్ప, ఆభరణములైనను, మరేవైనను - భార్యకు కానుకగా ఇవ్వబడి నట్లు ధృవీకరింపబడినవి దక్క - సర్వమును భర్తకు చెందినవే.

79. ప్రశ్న: సరైన సాక్షులు ఇద్దరి సాక్ష్యం ఆధారంగా ఒక అంశాన్ని నిర్ధారించవలసి వచ్చినప్పుడు పాటించ వలసిన న్యాయప్రమాణాల గురించి.

జవాబు: న్యాయప్రమాణములకు ప్రజలయం దత్యంత గౌరవమున్నది. భగవత్సేవకులు ఏ మతము వారైనను, తెగవారైనను వారి సాక్ష్యము ఆయన సింహాసనము ఎదుట అంగీకృతమే.

80. ప్రశ్న: దివంగతుడు ఒకవేళ హుఖుఖుల్లా పట్ల తన విధిని నిర్వర్తించక, ఇతర ఋణాలను పరిష్క రించకపోయిన పక్షంలో వీటిని నివాసం,  వ్యక్తిగత దుస్తులు, ఇతర ఆస్తిపాస్తుల నుండి తీసి పరిష్కరించ వచ్చునా; లేక నివాసాన్ని, వ్యక్తిగత దుస్తులను పురుషసంతతికి వదలివైచి, పర్యవసానంగా మిగిలిన ఆస్తిని ఉపయోగించి ఋణ విమోచన చేయాలా? ఒకవేళ ఋణాల పరిష్కారానికి మిగిలిన ఆస్తి చాలకపోతే ఏం చేయాలి?

జవాబు: చెల్లింపవలసిన ఋణములను, హుఖుఖుల్లా చెల్లింపును మిగిలిన ఆస్తి నుండే పరిష్కరింప వలె; అయితే, అట్టి పరిష్కారమునకు ఆస్తి చాలనిచో, తక్కిన మొత్తాన్ని నివాసమునుండి, వ్యక్తిగత వస్త్రముల నుండి చెల్లింపవలె.

81. ప్రశ్న: మూడవ అనివార్య ప్రార్థనను నిలిచి చేయాలా లేక కూర్చుని చేయాలా?

జవాబు : అత్యంత వినయభావమున, భక్తితో నిలిచి చేయుట సయుక్తము, సముచితము.

82. ప్రశ్న: అనివార్య ప్రార్థనలలో మొదటిదానిని తనకు ఎప్పుడు సమయం అనుకూలిస్తే అప్పుడు అత్యంత అణకువ , ఆకాంక్షాపూరిత ఆరాధనా భావంతో నిర్వర్తించాలి” అన్న నిర్దేశానికి సంబంధించి. దానిని ఇరవై నాలుగు గంటలకొక సారి చేయాలా, లేక తరచూ చేయాలా?

జవాబు: ఇరువదినాలుగు గంటలకొక్క పర్యాయము చాలును; దివ్యాజ్ఞానజిహ్వ నుడివినదిది.

83. ప్రశ్న: “ఉదయము”, “మధ్యాహ్నము”, “సాయంకాలము” - వీటి నిర్వచనమును గురించి. 

జవాబు: ఇవి సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయమును. అనివార్య ప్రార్థన కనుమతింపదగు వేళలు - ఉదయము నుండి మధ్యాహ్నము వరకు, మధ్యాహ్నము నుండి సూర్యాస్తమయము వరకు, ఇంకను సూర్యాస్తమయము నుండి ఆపై రెండు గంటల వరకును. అధికారము - దివ్యనామద్వయధారియగు భగవంతుని హస్తగతము.

84. ప్రశ్న : ఒక విశ్వాసి, విశ్వాసికాని వ్యక్తిని వివాహం చేసుకోవడం ఆమోద యోగ్యమేనా?

జవాబు: వివాహపరముగ యిచ్చిపుచ్చుకొనుటలు రెండునూ అనుమతింపదగినవే; ఔదా ర్యానుగ్రహముల సింహాసనమును అధిష్టించి నపుడు దేవదేవు డివ్విధముగ నిర్దేశించినాడు.

85. ప్రశ్న: దివంగతులకు ఉద్దేశించిన ప్రార్థన గుఱించి : దీనిని చేయవలసినది ఖననానికి ముందా, తర్వాతా? ఖిబ్లేహ్‌కు అభిముఖం కావడం అవసరమా?

జవాబు: ఖననమునకు పూర్వమే ఈ ప్రార్థనను గావింపవలె; ఇక ఖిబ్లేహ్ గురించి.... “మీ రేదిశకు అభిముఖులైన, ఆ దిశయందు దేవుని ముఖముండును.” (ఖురాన్ 2:115)

86. ప్రశ్న: మధ్యాహ్న లఘు అనివార్య ప్రార్థనకును, ఉదయ, మధ్యాహ్న సాయంకాలములలో చేయ వలసిన అనివార్య ప్రార్థనకును మధ్యాహ్న సమయం ఒక్కటే కనుక, ఈ ప్రార్ధనలను చేయడానికి విడివిడిగా శుద్ధీకరణలు అవసరమా లేక ఒక శుద్ధీకరణ సరిపోతుందా?

జవాబు : పునశ్శుద్ధీకరణలు అనవసరం.

87. ప్రశ్న: గ్రామస్థులు వెండిని వివాహశుల్కంగా ఇవ్వవలసినదాని గుఱించి : ఇక్కడ గ్రామస్థులై ఉండ వలసినది వరుడా, వధువా లేక ఇద్దరూనా? ఒకవేళ ఇద్దరిలోను ఒకరు నగరవాసి, మరొకరు గ్రామవాసి అయిఉంటే, ఏం చేయాలి?

జవాబు: వివాహశుల్కము వరుని నివాసస్థల ప్రాతిపదికన నిర్ణీతమైనది; అతడు నగరవాసియైన స్వర్ణమును, గ్రామీణుడైన రజతమును వివాహశుల్కమగును.

88. ప్రశ్న: గ్రామ లేక నగరవాసిని నిర్ధారించే ప్రమాణం ఏది? ఒక నగరవాసి గ్రామంలో లేదా ఒక గ్రామవాసి నగరంలో శాశ్వత ప్రాతిపదికపై నివాసాన్ని ఏర్పరచుకుంటే ఏ విధానం వర్తిస్తుంది? జన్మస్థలమే నివాసస్థాన నిర్ణయానికి ప్రాతిపదికా?

జవాబు: శాశ్వత నివాస మెచ్చోట కలదను దానిపై ఆధారపడి నిర్ణయించుటయే విధాయకము; దివ్య గ్రంథమందలి యాదేశము ననుసరింపవలె.

89. ప్రశ్న: పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణమునకు సరిపడా ఆర్జించిన వ్యక్తి, ఆ మొత్తంపై భగవంతుని హక్కును చెల్లించాలని పవిత్ర ఫలకములలో వెల్లడింపబడినది. ఈ పంధొమ్మిది అంటే ఎంతో వివరింప నగునా?

జవాబు: నూరింట పంధొమ్మిది అని దైవశాసనము స్థిరీకరించినది. దీనినే ప్రాతిపదికగ తీసికొని గణన చేయవలె. అప్పుడు పంధొమ్మిది పై ఎంత చెల్లింపవలెనో అవగతమగును.

90. ప్రశ్న: ఒక వ్యక్తి సంపద పంధొమ్మిదికి మించినప్పుడు ఆ అదనపు మొత్తంపై హుఖుఖ్‌ను చెల్లించడానికి గాను, అది మరొక పంధొమ్మిదికి చేరవలెనా లేక అదనపు మొత్తం ఎంతైనా హుఖుఖ్‌ను చెల్లించవలసినదేనా?

జవాబు: పంధొమ్మిదికి ఏ మొత్తము వచ్చిచేరినను, అది పంధొమ్మిదికి చేరునంతవరకు హుఖుఖ్ చెల్లింపు నుండి దానికి మినహాయింపు కలదు.

91. ప్రశ్న: స్వచ్ఛమైన జలము గురించి, దానిని వినియోగించవలసిన స్థాయిని గురించి.

జవాబు: హస్తములను, ముఖమును ప్రక్షాళన గావించుకొనుటకు ఒక పర్యాయము ఉపయోగింపబడిన స్వల్పపరిమాణపు - అనగా ఒకటి లేక రెండు, లేదా మూడు పానపాత్రల పరిమాణం గల - జలం. అయితే, ఒక కుర్ర్ (షుమారుగా ఒక ఘ. లీ.) లేదా అంతకు మించిన పరిమాణముగల జలము ఒకటి, రెండు పర్యాయములు ముఖప్రక్షాళనము గావించుటచే మార్పునొందదు. అట్టి జలము, మువ్విధముల (రంగు, రుచి,వాసనల) యం దేవిధముగను చెడనిచో వాడకమునకు అభ్యంతరముండ జాలదు. ఉదాహరణకు వివర్ణమైన జలమును, ఉపయోగించిన జలముగనే గణియింపవలె.

92. ప్రశ్న: వివిధప్రశ్నలపై వెలువడిన ఒక పారశీక గ్రంథంలో యుక్తవయస్సు పదిహేనేళ్లుగా నిర్ణయింప బడినది. అదేవిధంగా వివాహం కూడా యక్త వయస్సుకు సంబంధించిన నియమానికి లోబడి ఉంటుందా లేక అంతకు ముందే చేయడానికి అనుమతింపదగునా?

జవాబు: దైవగ్రంథమునం దిరుపక్షముల సమ్మతి యవసరమని చెప్పబడుట చేతను, యుక్తవయస్సు నకు పూర్వమే ఆ పక్షములకు సమ్మతి కలదా లేదా యనునది స్పష్టము కాదు కనుకను వివాహము యుక్త వయస్సు నియమమునకు లోబడియుండవలె; తత్పూర్వ వివాహ మామోదనీయము కాదు.

93. ప్రశ్న: అస్వస్థులు ఉపవాస, అనివార్య ప్రార్థనలను చేయడం గురించి

జవాబు: భగవంతుని దృష్టియం దనివార్యప్రార్థనయును, ఉపవాస నియమములును ఉత్కృష్ట స్థానము నొందునని యదార్ధముగ వచియింతును. అయినను, ఆరోగ్యస్థితియందే వాటి వైశిష్ట్యముల అనుభూతి నొందవచ్చును. అనారోగ్యస్థితియం దీవిధులను నిర్వర్తింప ననుమతిలేదు. సర్వావస్థల యందునను, దేవదేవుని - ఆయన వైభవము మహోన్నతమగు గాక - యానతిట్టిది. ఆయన ధార్మిక నియమము లకు చెవియొగ్గి, పాటించు స్త్రీపురుషులు ధన్యులు. నిశ్శంశయాత్మక నిర్ధారణముల యావిష్కర్తయును, దివ్యప్రవచములను భువికంపిన దేవునికే సకల ప్రశస్తి.

94. ప్రశ్న: మసీదులకు, ప్రార్థనామందిరములకు, దేవాలయములకు సంబంధించి
 
జవాబు: ఏకైక సత్యదేవుని ఆరాధనకై నిర్మితములైన మసీదులు, ప్రార్థనా మందిరములు, దేవళములు వంటి వేటినైనను భగవన్నామస్మరణకు దక్క అన్య ప్రయోజనమునకు వినియోగింపరాదు. దైవశాసన మిది; దీనిని ఉల్లంఘించినవాడు నిశ్చయముగ హద్దులనతిక్రమించినవాడగును. నిర్మాణకర్త కెట్టి హాని యును కలుగదు; ఏలయన ఆతడా కార్యమును భగవంతునికై నిర్వహించి సముచిత పురస్కృతి నందినాడు; ఇంకను అందుచునే యుండును.

95. ప్రశ్న: వృత్తి వాణిజ్య నిర్వహణకు అనువగు స్థానముల నేర్పరచుకోవడం గురించి; వీటిపై హుఖుఖుల్లా చెల్లించవలసి ఉంటుందా లేక గృహోపకరణము లకు సంబంధించిన శాసనమే వీటికి వర్తిస్తుందా?

జవాబు: గృహోపకరణములకు నిర్దేశితమైన శాసనమే వీటికిని అనువర్తించును.

96. ప్రశ్న: ధర్మనిధులలో ఉంచబడిన ఆస్తిని, తరుగుదల లేదా నష్టం నుండి కాపాడుటకై, నగదు, తదితర ఆస్తుల రూపంలోకి మార్పిడి చేయడం గురించి.

జవాబు: ధర్మనిధులయందలి యాస్తిని తరుగుదల, నష్టముల నుండి పరిరక్షించు నిమిత్తమై ఆస్తిని రూపాంతర మొనరించుట గురించి లిఖితపూర్వకముగ నడుగబడిన ప్రశ్నకు సంబంధించి, అట్టి యాస్తి విలువకు సమానమగు ప్రత్యామ్నాయముతో మార్పిడి గావించుకొనుట ఆమోదనీయమే. నిశ్చయముగా నీ ప్రభుడు నిగూఢార్థ వ్యాఖ్యాత, సర్వజ్ఞుడు, యదార్థమునకాయన నిర్దేశకుడు, దివ్య దినప్రాచీనుడు.

97. ప్రశ్న: చలికాలంలోను, వేసవిలోను పాదప్రక్షాళనం చేసుకోవడం గురించి:

జవాబు: రెండు సందర్భములయందునను ఒకే విధము. ఉష్ణోదక వినియోగమునకు ప్రాధాన్యత; కాని, శైత్యోదకమున కభ్యంతరమును లేదు.

98. ప్రశ్న: విడాకులపై వేరొక ప్రశ్న

జవాబు: దేవుడు - ఆయన వైభవము ఉన్నతినొందు గాక - విడాకులకు సానుకూలుడు కానందున, ఈ యంశమై ఏమియును వెల్లడింప బడలేదు. అయినను, నిరీక్షణా వత్సరారంభము నుండి సంవత్సరాంతము వరకు ఇరువురు గాని అంతకు ఎక్కువమంది గాని సాక్షులుగా పరిశీలింపు చుండవలె; ఒక వేళ తుదివరకును సామరస్యము కుదరనియెడల విడాకులు చోటుచేసుకొనును. ఈ విడాకుల వ్యవహారమును న్యాయమందిర ధర్మకర్తలచే నియుక్తుడైన న్యాయాధికారి నమోదు చేసికొన వలె. ఈ విధానము నవలంబించుట అత్యావశ్యము; లేనిచో అవగాహనాపరుల మనములు వ్యధ నొందవచ్చును.

99. ప్రశ్న: సమాలోచనము గురించి 

జవాబు: సభలోని తొలి వర్గ సదస్యుల సమాలోచనము అభిప్రాయ భేదముతో ముగిసెనేని నూతను లను చేర్పవలె. ఆ పై మహోన్నతనామ సంఖ్యకు సరిపడునంత లేదా ఎక్కువ లేదా తక్కువ మందిని లాటరీ మూలమున ఎంచుకొనవలె. ఆపై సమాలోచనము పునరారంభింపబడవలె. తత్పర్యవసాన మేదైనను అంగీకరింపబడవలె. అభిప్రాయభేదము లింకను కొనసాగెనేని, ఆ విధానమునే ఒకటి రెండు పర్యాయము లాచరింపవలె; అధికసంఖ్యాకు లామోదించినదే నిర్ణయమగును. నిశ్చయముగా ఆయన, తానెంచుకొనిన వారికి సన్మార్గదర్శనము గావించును.

100. ప్రశ్న: వారసత్వార్జితము గురించి

జవాబు: వారసత్వార్జితమునకు సంబంధించి, సర్వప్రథమబిందువు - ఆయన దక్క అన్యుల ఆత్మలన్నియును ఆయనకై యర్పితమగు గాక - చే నిర్దేశితమైనది సంప్రీతికరముగ నున్నది. సజీవులైన వారసులందరును తమకు కేటాయించబడిన వారసత్వపు వాటాను అందుకొనిన మీదట, తక్కిన యాస్తిపై నివేదిక నొకదానిని మహోన్నతుని న్యాయస్థానమునకు సమర్పింపవలె. అధికారమూల మాయన హస్తమునందున్నది. ఆయన తన యభీష్టమునే నిర్దేశించును. ఈ విషయమై, జాడతెలియని వారసుల వాటాను, తాత్కాలికముగా, ఇందు గురించిన నిర్దేశమొక్కటి చాటబడునంతవరకును, సజీవులుగానున్న వారసుల కనుగ్రహింపుచు మార్మికభూమి (అడ్రియానోపుల్) యందొక శాసనమావిష్కృతమైనది. అయితే ప్రాచీన సౌందర్యునివోలె ఆ సంవత్సరమే వలసవెళ్లిన వారి వారసత్వపువాటా, వారి వారసులకు ఇవ్వబడినది; భగవంతుడు వారి కనుగ్రహించిన పురస్కృతి యిది.

101. ప్రశ్న: నిధి, నిక్షేపముల శాసనమునకు సంబంధించి.

జవాబు: నిక్షేపము లభ్యమయ్యెనేని, అందలి మూడవవంతు దానిని కనుగొనిన యాతినిది; కాగా, తక్కిన రెండు వంతులును న్యాయమందిర జనులచే ప్రజాసంక్షేమార్థమై వెచ్చింపబడవలె. న్యాయమందిరము సంస్థాపితమైనప్పుడిది అమలులోనికి వచ్చును. అంతవరకును దానిని, ఆయా ప్రదేశములయందలి, ప్రాంతముల యందలి విశ్వసనీయుల చెంత భద్రపరుపవలె. సత్యమునకు ఆయన మహాపాలకుడు, శాసనకర్త, సర్వజ్ఞుడు, సకలవిదుడు.

102. ప్రశ్న: ఫలసాయము నార్జింపని స్థిరాస్తులపై హుఖుఖ్ చెల్లింపు గురించి.

జవాబు: ఆదాయము నార్జింపని అనగా ఎట్టి ఫలసాయము నీయని స్థిరాస్తులపై హుఖుఖ్‌ను చెల్లింప వలసిన అగత్యము లేదని దైవశాసనము. నిశ్చయముగా ఆయన అధిపతి, ఔదార్యప్రదాత.

103. ప్రశ్న: “దివారాత్రముల యవధి సుదీర్ఘముగ నుండు ప్రదేశములయందున గడియారముల . . . వలన ప్రార్థనా సమయములు తెలిసికొనబడు గాక” యను పవిత్ర ప్రవచనమునకు సంబంధించి:

జవాబు: మారుమూల ప్రదేశములని భావము. మరి, ఈ వాతావరణముల యందలి కాలదైర్ఘ్య వ్యత్యాసము కేవలం కొద్ది గంటలే కనుక, ఈ నియమము అనువర్తింపదు.

104. “నిశ్చయముగా, తన తండ్రిని సేవించుటను ప్రతి కొమరునికిని నిర్ణయించితి” మన్న పవిత్ర ప్రవచనము ఆబా బదీ దివ్యఫలకము నందు వెలువరింపబడినది. భగవంతుని దివ్యగ్రంథమున మేమిచ్చిన నిర్దేశమిట్టిది.

105. మరియొక ఫలకమునం దీ మహత్తర వాక్కులు ఆవిష్కతమైనవి : ఓ మహమ్మద్ ! నిన్ను ప్రస్తావింపుచు, తమ బిడ్డలకు శిక్షణ నిమ్మని దైవ జనులను హెచ్చరింపుచు, దివ్యదినప్రాచీనుడు తన వదనమును నీ వంకకు అవలగ్నము గావించినాడు. ఆద్యంతరహితుడగు మహాప్రభుని దివ్య లేఖినిచే కితాబ్-ఎ-అఖ్దస్ నందు పొందుపరుపబడిన ఈ అత్యంతావశ్యక దివ్యాదేశము నుపేక్షించిన యే తండ్రి యైనను తన పితృస్వామ్యమును కోల్పోయి భగవంతుని యెదుట దోషిగ గణియింపబడును. దైవ బోధనలను తన మనోఫలకమున ముద్రించుకొని, దృఢచిత్తుడై వాని ననుసరించు నాతనికి శుభ మగును. వాస్తవమునకు, భగవంతుడు తన భృత్యులకు సహకరించి, సత్ఫలితములనిచ్చి తనను సమీపించుటకు శక్తినిచ్చు వానినే యనుగ్రహించును. ఆయన నిర్దేశకుడు, నిరంతరుడు.

106. ఆయన భగవంతుడు, దివ్యాధికారములుగల ప్రభుడగు ఆయన మహోన్నతుడగు గాక ! మానవజీవన వృక్షాంతరాళమున నిక్షిప్తపరుప బడినది సాక్షాత్కరింపబడుటకును, వాటికి సత్ప్రవర్తన, సదవగాహన లనెడు జీవజలములతో సంరక్షించుటకును సత్యైక దేవునిచే ప్రవక్తలును, శ్రేష్ఠతములును నియోగింప బడినారు. ప్రతి వృక్షమును ఫలములనిచ్చునని యును, వంధ్యావృక్షము అగ్ని కాహుతి యగుటే యుక్తమనియు నిట్టే తెలియనైనది. ఈ ప్రబోధకులు వచించిన, ప్రబోధించిన సమస్తము యొక్క ఉద్దేశ్యము కేవలం మానవుని యున్నత స్థాయిని పరిరక్షించుటయే. భగవంతుని కాలమున ఆయన ప్రబోధములను దృఢముగ నవలంబించి, ఆయన యదార్ధ, మౌలిక శాసనము నుండి వైదొలగక నిలిచియుండు నాతడు ధన్యుడు. విశ్వసనీయత, దైవభక్తి, సత్యసంధత, నిష్కపటములే మానవ జీవనవృక్షమునకు ఉత్తమ ఫలములుగ నొప్పును; కాని వీటన్నింటికన్న గొప్పది: ప్రఖ్యాతుడును, మహిమాన్వితుడును అగు భగవంతుని - ఆయన ప్రకీర్తితుడు అగు గాక - ఏకత్వమును గుర్తించిన పిదప, తల్లిదండ్రుల పట్ల తమకుగల హక్కులను గుర్తించుట. భగవంతుని దివ్యగ్రంథము లన్నింటి యందునను ఈ ప్రబోధము ప్రస్తావితమై పరమోన్నతలేఖినిచే పునఃస్థిరీకృత మైనది. “సమతుల్యుని గాని, సదృశుని గాని భగవంతునికి ఆపాదించక ఆయన నారాధింపుడు; మీ తల్లిదండ్రుల యెడ వాత్సల్యమును, ఆదరమును ప్రదర్శింపు” డని పవిత్ర ఖురాన్ గ్రంథము నందు దయామయుడగు భగవంతుడు - ఆయన కీర్తితుడును, ప్రకీర్తితుడును అగు గాక - వెలువరించిన వాక్కులను గణియింపుడు. నిజైక దేవుని గుర్తించుటకును, మాతాపితరుల యెడ ప్రేమానురాగములకును సారూప్యమెట్లు కూర్పబడినదో గమనింపుడు! ప్రాచీన పవిత్ర గ్రంథములయందునను, ఈ యసమాన అద్భుత ఫలకము నందునను దైవావిష్కృతమైనదానిని వీక్షించి, గ్రహించి, పఠించి, పరమార్థము నెరిగి, పాటించుటకై సద్వివివేకమును, సదవగాహనాశక్తి యును అనుగ్రహింప బడినవారు సంతోషాత్ములు.

107. ఆయన - ఆయన వాక్కు లుత్కృష్టత నొందుగాక - తన ఫలకముల యందొక దానియందిటుల వెలువరించినాడు: అవ్విధముగనే, జకాత్ విషయమునను, ఖురాన్ నందావిష్కృత మైనదాని ననుసరింపుడని నిర్దేశింపుచున్నాము.

